– కాళేశ్వరంపై ఎంక్వైరీ షురూ..
– రంగంలోకి పీసీ ఘోష్ కమిటీ
– 9 అంశాలపై కమిటీ ఫోకస్
– హైదరాబాద్‌లో ఆఫీస్ రెడీ
– జూన్ 30నాటికి రానున్న నివేదిక
A Special Commission Of Inquiry To Find The Culprits in the Kaleswaram Project: తెలంగాణలో సంచలనం సృష్టించిన మేడిగడ్డ కుంగుబాటు తర్వాత నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ ఎంక్వైరీకి ముందుకొచ్చింది. సుప్రీంకోర్టు మాజీ జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలో స్పెషల్ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. ఇరిగేషన్ సెక్రెటరీ రాహుల్ బొజ్జ అధికారుల బృందం మంగళవారం ఇప్పటికే ఘోష్‌తో భేటీ కావటం, ప్రభుత్వం కమిషన్ ఏర్పాటుకు విడుదల చేసిన గెజిట్ ప్రతులను ఘోష్‌కు అందించటం జరిగిపోయాయి. 9 అంశాలతో వివరాలు ఇవ్వాలని ప్రభుత్వానికి ఘోష్ మిషన్ లేఖ రాసింది. జూన్ చివరి వారం నాటికి విచారణ పూర్తి చేయాలని ఘోష్ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
ఇక.. వచ్చే వారం హైదరాబాద్ రానున్న ఘోష్ కమిషన్ బృందం కోసం బూర్గుల రామకృష్ణారావు భవన్ (బీఆర్‌కేఆర్)లో విచారణ కమిటీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిషన్.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంతో పాటు ప్లానింగ్, డిజైనింగ్‌లో లోపాలు, అవకతవకలు, నిర్లక్ష్యంపై విచారణ చేపట్టటంతో బాటు కాంట్రాక్టర్లకు పని అప్పగింత, పనుల అమలు తీరు, అవకతవకలు, ఆర్థిక క్రమశిక్షణ పాటించకుండా కాంట్రాక్టర్లకు పనుల అప్పగింతకు కారకులను గుర్తించనుంది.
Read Also:ఇందూరు అందేది ఎవరికో.? విజయసాధనకు పార్టీల వ్యూహాలు
మూడు బ్యారేజీల్లో ఆపరేషన్ మెయింటెన్స్‌లో నిర్లక్ష్యానికి బాధ్యులైన వారితో పాటు బ్యారేజీలు దెబ్బతినడానికి గల కారణాల మీద దృష్టి సారించనుంది. అదే విధంగా క్వాలిటీ కంట్రోల్, పర్యవేక్షణ కోణంలో నిర్లక్ష్యం, కాంట్రాక్టర్లు/ఏజెన్సీలు, శాఖలోని అధికారుల తప్పిదాలపై, నిబంధనలకు విరుద్ధంగా పనులు పూర్తి చేయడానికి పొడిగింపులు, పనులు పూర్తయినట్లు కాంట్రాక్టర్లకు సర్టిఫికెట్లు ఇవ్వడం, గడువు కన్నా ముందే బ్యాంకు గ్యారెంటీలను విడుదల చేయడం, కాంట్రాక్టర్లకు అనుకూలంగా వ్యవహరించడం వంటి అంశాల్లో బాధ్యులైన అధికారులను గుర్తించనుంది.ఈ అక్రమాల కారణంగా తెలంగాణ ఖజానాపై పడిన ఆర్థిక భారం, ఆర్థిక నష్టాలు, ఏజెన్సీల పాత్రను కూడా కమిటీ బయటకు తీసుకురానుంది.