A new vaccine for dengue received prequalification from the WHO:
ప్రతి ఏటా డెంగ్యూ బారిన పడి పెద్ద ఎత్తున మరణాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా భారత్ కు డెంగ్యూ పెద్ద ప్రమాదకారిగా మారింది. భారత్ లో ప్రతి ఏటా వర్షాకాలం మొదలయ్యే ముందు దేశవ్యాప్తంగా సగటున 3.3 కోట్ల మంది మంది డెంగ్యూ వ్యాధికి గురవుతున్నారని అంచనా. డెంగ్యూతో కోలుకోవడం చాలా కష్టం. ప్లేట్ లెట్స్ పడిపోవడం, మనిషి మరణపు అంచులకు వెళ్లడం ఖాయం అని అంటున్నారు. ఇక ఆ కష్టాలకు కూడా చెల్లుచీటీ పాడే అవకాశముందని తేలిపోయింది. ఇప్పటి వరకూ డెంగ్యూ వస్తే కేవలం చికిత్సతోనే సరిపెడుతున్నారు. దోమలు కుట్టకుండా చూసుకోండి అని నివారణోపాయం చెబుతున్నారు. కానీ ఇకపై డెంగ్యూకి నివారణగా సరికొత్త టీకాని అందుబాటులోకి తెస్తున్నారు.
క్యూడెంగా టీకాకు అనుమతి
డెంగ్యూ కట్టడికి రూపొందించిన రెండో టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆమోదం తెలిపింది. ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందడానికి ఈ చర్య ఉపకరిస్తుంది. ఈ ఏడాది ఆసియా, లాటిన్ అమెరికా దేశాల్లో డెంగ్యూ విజృంభణ పెరిగిన నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. జపాన్‌కు చెందిన ఔషధ సంస్థ డెంగ్యూ ఈ టీకాను అభివృద్ధి చేసింది. దీని పేరు క్యూడెంగా. ఆరు నుంచి 16 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులకు దీన్ని ఇవ్వవచ్చని డబ్ల్యూహెచ్‌వో సూచించింది. వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ టీకాలను అందివ్వాలని కోరింది. ఇందులో రెండు డోసులు ఉంటాయి. ఇది నాలుగు రకాల డెంగీల నుంచి రక్షణ కల్పిస్తుంది. 2022లో దీనికి ఐరోపా ఔషధ సంస్థ నుంచి ఆమోదం లభించింది. తాజాగా డబ్ల్యూహెచ్‌వో కూడా పచ్చజెండా ఊపడం వల్ల వివిధ దాతృత్వ సంస్థలు, ఐరాస అనుబంధ విభాగాలు ఈ వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసి, పేద దేశాలకు పంపిణీ చేయడానికి వీలవుతుంది.
హైదరాబాద్ బయోలాజికల్-ఈ తో భాగస్వామ్యం
జపాన్‌కు చెందిన బయోఫార్మాస్యూటికల్స్ కంపెనీ తకెడా డెంగ్యూ వ్యాక్సిన్ల (క్యూడెంగా) తయారీని వేగవంతం చేయడానికి హైదరాబాద్‌కు చెందిన ‘బయోలాజికల్-ఈ’ (బీఈ)తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. బయోఆసియా వేదికగా కుదిరిన ఈ ఒప్పందం కింద బయోలాజికల్-ఈ ఏడాదికి 5 కోట్ల డెంగ్యూ వ్యాక్సిన్ డోసేజీలు తయారుచేస్తుంది. ఒక దశాబ్ది కాలంలో ఏడాదికి 10 కోట్ల వ్యాక్సిన్ డోసేజీలు తయారుచేయాలన్న తకెడా లక్ష్యాన్ని ఈ భాగస్వామ్యం వేగవంతం చేస్తుంది. దీనివల్ల డెంగ్యూ వ్యాధి ప్రబలంగా ఉన్న దేశాలకు జాతీయ ఇమ్యునైజేషన్ కార్యక్రమం కింద క్యూడెంగా వ్యాక్సిన్లు తగినన్ని అందుబాటులోకి వస్తాయని తకెడా గ్లోబల్ వ్యాక్సిన్ బిజినెస్ యూనిట్ ప్రెసిడెంట్ గ్యారీ డబిన్ అన్నారు. వ్యాక్సిన్ల తయారీలో బీఈకి లోతైన నైపుణ్యం ఉన్నదంటూ తమ భాగస్వామ్యం ప్రపంచం నుంచి డెంగ్యూను నిర్మూలించగలదన్న విశ్వాసం ఆయన ప్రకటించారు. క్యూడెంగా వ్యాక్సిన్ల తయారీలో తకెడాతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం గర్వంగా ఉన్నదని బీఈ మేనేజింగ్ డైరెక్టర్ మహిమ దాట్ల అన్నారు. ప్రస్తుతం క్యూడెంగా వ్యాక్సిన్లు యూరప్, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌లలో పిల్లలకు, పెద్దలకు కూడా ప్రైవేటుగా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ వినియోగానికి భారత్‌లో అనుమతి లేదు.
కొత్త థెరపీల అభివృద్ధి
హైదరాబాద్‌లో మిల్టెనీ బయోటెక్ సీఓఈ జర్మనీకి చెందిన బయో మెడికల్ ఉత్పత్తులు, సేవల కంపెనీ మిల్టెనీ బయోటెక్ హైదరాబాద్‌లో తొలి కార్యాలయాన్ని, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను (సీఓఈ) ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. భారత్‌లో ఈ తరహా సీఓఈల్లో ఇదే మొదటిదని కంపెనీ తెలిపింది. శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పరిశ్రమ నిపుణులు, క్లినికల్ నిపుణులు ఈ కేంద్రంలో సెల్, జీన్ థెరపీల్లో ప్రత్యక్ష శిక్షణ పొందగలుగుతారని కంపెనీ ఎండీ బోరిస్ స్టోఫెల్ బయోఆసియా సదస్సు సందర్భంగా ప్రకటించారు. దీనివల్ల ప్రీ క్లినికల్/క్లినికల్ అభివృద్ధి, వాణిజ్యపరంగా వాటిని అందుబాటులోకి తేవడంపై వారికి అవగాహన ఏర్పడుతుందన్నారు. రోగులకు ఇప్పటివరకు అందుబాటులో లేని వైద్య అవసరాలు తీర్చడానికి వీలుగా కొత్త థెరపీల అభివృద్ధిపై ప్రభుత్వ సహకారాన్ని ఆయన కోరారు.