A Hundred Days Rule That Brought Light : తిడితే తిట్టనీ, కొడితే కొట్టనీ, ఎవరేమన్నా అనుకుంటే అనుకోనీ.. ప్రజలే నా ప్రాణం. వారి సంక్షేమమే నా లక్ష్యం. వారికోసం నిటారుగా నిలబడి కొట్లాడుతా! అంటూ రేవంత్ రెడ్డి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. పదేళ్లపాటు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్‌పై సర్వశక్తులూ కూడగట్టుకుని దూకుడుగా పనిచేశారు. కాంగ్రెస్‌లోని నేతలందరినీ ఒక్కమాట మీదికి తీసుకొచ్చారు. దీంతో గత అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించింది. నేటితో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి వంద రోజులు పూర్తి అయ్యింది. మరి ఈ వంద రోజులలో రేవంత్ రెడ్డి పాలన గతంలో ఆయన చెప్పినట్లుగా ప్రజలే ప్రాణంగా.. వారి సంక్షేమమే ఊపిరిగా సాగిందా? అన్నదానిపై నేడు అందరి దృష్టీ ఉంది.
డిసెంబరు 7న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి ఒకపక్క రంగం సిద్ధమవుతుండగానే, మరోవైపు దొరల పాలనకు ప్రతీకగా తొమ్మిదేళ్ల పాటు నిలిచిన ప్రగతి భవన్ ముందున్న ముళ్ల కంచెలు, భారీ ఇనుప బారికేడ్స్ తొలగింపు కార్యక్రమం సాగిపోయింది. పదిహేడు అడుగుల రాతి ప్రహరీతో, అడుగడుగునా ఇనుప కంచెలతో దొరల గడీని తలపించే ఆ విశాల భవన ప్రాంగణంలోకి సైతం సామాన్యులెవరూ పదేళ్లపాటు అడుగుపెట్టలేక పోయారు. అయితే.. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే దాని పేరును జ్యోతీరావు పూలే ప్రజాభవన్‌గా మార్చారు. పదేళ్ల పాటు సాగిన ఫామ్‌హౌస్ పాలనకు చరమగీతం పాడి సచివాలయం కేంద్రంగా ప్రజాస్వామ్యయుతమైన పాలనకు ప్రాణప్రతిష్ఠ చేశారు. అంతే కాదు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు వింటూ, వాటిని పరిష్కరించే దిశగా వడివడిగా అడుగులు వేశారు.
Read More: ఈడీ అదుపులో ఎమ్మెల్సీ కవిత
పాలన విషయానికి వస్తే, ప్రభుత్వాన్ని నడపడం రేవంత్ రెడ్డికి కత్తి మీద సాములా ఉంది. ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే.. ఒకవైపు కేసీఆర్ పదేళ్ల పాలనలో దెబ్బతిన్న రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పూర్తిగా కుదేలైపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆర్థికంగా దివాళా తీసి, తెచ్చిన అప్పులకు వడ్డీ కూడా కట్టలేని దుస్థితి. మరోవైపు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యతను నెరవేర్చాల్సి ఉంది. అయినా ముఖ్యమంత్రి తడబడకుండా, ఓపికగా ఒక్కో అడుగూ ముందుకు వేసుకుంటూ సాగారు. ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు మాజీ ఆర్‌బిఐ రఘురాం రాజన్ వంటి ఆర్థిక నిపుణుల, మేధావుల సలహాలు సూచనలు తీసుకుంటూ దుబారా ఖర్చులను తగ్గించుకుంటూ, ఆర్థిక వనరులను పెంచుకునే మార్గాలను అన్వేషించే పనిలో దిగారు. అదే సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు కార్యాచరణను రూపొందించారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వంద రోజులలో ఎన్నికల వేళ ‘అభయహస్తం’ పేరిట ఇచ్చిన 6 ప్రధాన వాగ్దానాల అమలులో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, డ్వాక్రా మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు అందించే ‘మహిళా శక్తి’ పథకం, రూ.500కే వంటగాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు చర్యలు, రైతు బంధు నిధుల విడుదల వంటి హామీలు అమలు చేసి సమర్థుడైన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన సమర్థతను చాటుకున్నారు. ఇక్కడ సమర్థత అనే మాట ఎందుకు అనాల్సి వస్తోందంటే… ఎమ్మెల్సీగా, ఎమ్మె్ల్యేగా, ఎంపీగా ఆయన ఎప్పుడూ విపక్షానికే పరిమితమయ్యారు. పైగా ఒక్కసారి కూడా మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు. కానీ, ఖాళీ ఖజానా చేతికొచ్చినా, ఆదాయ మార్గాలు కనుచూపుమేరలో కనిపించకపోయినా ఇచ్చిన మాటకు కట్టుబడి వాగ్దానాల అమలుకు శ్రీకారం చుట్టారు.
Read More: పొడుస్తున్న పొద్దు… నడుస్తున్న చరిత్ర!
కొత్త ప్రభుత్వం కొలువు దీరిన నెల రోజులకే ‘కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయటంలేదు..రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేసాడు’ అంటూ ప్రధాన ప్రతిపక్షంతో పాటు ఇతర విపక్షాలు విమర్శల దాడికి దిగాయి. ‘రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలోనే పడిపోతుంది.. 6 నెలల్లోనే మనం అధికారంలోకి రాబోతున్నాం’ అంటూ బిఆర్‌ఎస్ నేతలు పదేపదే మాట్లాడారు. తొమ్మిదిన్నరేళ్లు నిరాటకంగా పాలించి, ఊహించని రీతిలో భంగపాటుకు గురై విపక్షానికే పరిమితం కావటం వల్ల గులాబీ నేతలు అలా మాట్లాడారని తొలినాళ్లలో అందరూ భావించారు. అయితే, బీజేపీ సీనియర్ నేతలు సైతం పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని ప్రకటించటంతో బీజేపీ, బీఆర్‌ఎస్ నేతల ఎజెండా ఒక్కటేననే వాదనా వినిపించింది. పార్లమెంట్ ఎన్నికల తరువాత బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు ఒక్కటై, తెలంగాణలోని రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోస్తాయనే చర్చ కూడా జోరుగా నడిచింది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా దీటుగా స్పందించారు. ‘మేము గేట్లు తెరిస్తే బిఆర్ఎస్‌లో ఒక్కరూ మిగలరు’ అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఆ వెంటనే గులాబీ నేతలంతా తమ గూటి నుంచి బయటికి వచ్చి కాంగ్రెస్, బీజేపీలో చేరటం మొదలైంది. చాలామంది బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే లు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్లమెంట్ ఎన్నికలు పూర్తయ్యే నాటికే బీఆర్‌ఎస్ పార్టీ ఖాళీ అయ్యేలా కనిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే రేవంత్ రెడ్డి పార్టీనే కాదు, ఐదేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్నీ సమర్ధవంతంగా నడపగల నేతగా స్థిరపడినట్లే.
గత తొమ్మిదిన్నరేళ్ల కాలంలో తెలంగాణ తన సాంస్కృతిక అస్తిత్వాన్ని కోల్పోయిన విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి అందెశ్రీ రాసిన ‘జయ జయహే తెలంగాణ’ గీతాన్ని రాష్ట్ర అధికార గీతంగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం వెంటపడి, వాహనాల మీద తెలంగాణ పేరును సూచించేలా గతంలో నిర్ణయించిన ‘టీఎస్’ స్థానంలో ‘టీజీ’ ఉండేలా మార్పు చేశారు. గత ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహ నమూనాలోనూ కొన్ని అవసరమైన మార్పులను చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. వంద రోజుల రేవంత్ రెడ్డి పాలనకు వంద మార్కులు వేయొచ్చు. ఎందుకంటే ఇచ్చిన హామీలు అమలు చేస్తూ, ప్రభుత్వాన్ని అస్థిర పరచాలనే విపక్షాల కుట్రలను తిప్పికొడుతూనే దెబ్బతిన్న తెలంగాణ అస్తిత్వానికి ప్రాణప్రతిష్ఠ చేస్తూ ముందుకు సాగుతున్న రేవంత్ పాలనకు వర్తమాన తెలంగాణ సమాజం జైజైలు కొడుతోంది.
– పీవీ శ్రీనివాస్ (ఎడిటర్ ఇన్ చీఫ్, బిగ్‌టీవీ)