A Benami Company That Shocked The Former Collector : బీఆర్ఎస్ హయాంలో లెక్కలేనంత అవినీతి. నాయకులు, అధికారులు.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాలా పెద్దదే. ముఖ్యంగా అవినీతి అధికారులు సంపాదించిన అక్రమ సంపద అంతా రియల్ ఎస్టేట్ కంపెనీల్లోకి వెళ్లింది. బడా రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెడితే బ్లాక్ మనీ అంతా వైట్‌గా మార్చుకోవచ్చని ఆశ పడ్డారు. మరీ ముఖ్యంగా బిహార్ గ్యాంగ్ ఆఫీసర్స్ అంతా ‘అమోయ్’కంగా నమ్మి పెద్ద పెద్ద కంపెనీలకు వందల కోట్లు చేరవేశారు. వారి అక్రమ సంపద ఎక్కడ ఉందంటే రియల్ సంస్థల్లోనే అని చెప్పవచ్చు. ప్రై ఏరియాలో భూములు ఉన్నందున ఎప్పుడైనా అమ్ముకోవచ్చని అనుకున్నారు. వంద కోట్లు పెట్టి ఎకరం భూమి కొనుగోలు చేసిన సంస్థను రంగారెడ్డి మాజీ కలెక్టర్ అమాయకంగా నమ్మేశారు. ఆయన పెట్టుబడి పెట్టిన సంస్థ కూడా ఓ మాజీ కలెక్టర్ కుటుంబానిదే కావడంతో అంతా సేఫ్ అనుకున్నారు. ధరణి పేరుతో అధికార పార్టీ నేతల నుంచి వందల కోట్లు తీసుకుని 200 కోట్ల దాకా అప్పగించారు. ఈయనే కాదు, మిగిలినవాళ్లు కూడా బడా రియల్ సంస్థలైన ఫినిక్స్, శ్రీనిధి, వంశీరామ్, డీఎస్ఆర్, అదిత్యలకు పెట్టుబడుల కోసం నగదు రూపంలో ఇచ్చారు.
ప్రభుత్వం మారడంతో బినామీల వద్దకు ఆఫీసర్స్
బీఆర్ఎస్ వస్తుందని బలంగా నమ్మిన అధికారులు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో అక్రమ సంపదపై దృష్టి పెట్టారు. అవినీతి సొమ్ము కోసం బినామీ సంస్థల వైపు అడుగులు పడ్డాయి. తమకు ఇవ్వాలనుకున్న రేషియోలో రిజిస్ట్రేషన్ చేయాలని అడగడంతో లొల్లి మొదలయింది. నువ్వసలు డబ్బులు ఎప్పుడిచ్చావ్ అని అనడంతో ఆ వెంకటేశ్వరుడి కళ్లు బైర్లు కమ్మాయి. ఏదైనా పేపర్ రాసుకున్నామా? ప్రూఫ్ ఏమైనా ఉందా? అని అడిగేసరికి మాటలు రాక హై బీపీతో అయోమయంగా వెనుదిరిగాడు. ఈ విషయాన్ని ఆయనకు పరిచయం ఉన్న బిహారీ అధికారులతో చెప్పుకోవడంతో ఇప్పుడు ఆ సర్కిల్ అంతా ఒకటే హాట్ టాపిక్‌గా మారింది. మన బినామీలు ఎలా స్పందిస్తారోనని బిక్కు బిక్కుమంటున్నారు.
కలెక్టర్స్, మున్సిపాల్టీ, పోలీస్ ఆఫీసర్స్ వద్ద భారీగా నగదు
ధరణి పుణ్యమా అని కలెక్టర్స్, మున్సిపాల్టీ డైరెక్టర్స్, పోలీస్ ఆఫీసర్స్ హైదరాబాద్ శివారుల్లో భూములపై భారీగా నగదు కూడబెట్టారు. ఆ సొమ్మును ఎక్కడ పెట్టినా ఇబ్బందులే అనుకుని రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. ఆ సొమ్ము రెండేడ్లలో డబుల్ అవుతుందని నమ్మారు. కానీ, ప్రభుత్వం మారడంతో ఇప్పుడు అంతా తారుమారు అయింది. ఇచ్చిన సొమ్ముకు కనీసం రిసిప్ట్స్, అగ్రిమెంట్స్ , రిజిస్ట్రేషన్ లాంటివేం లేవు. ఇప్పుడా పని చేసుకోవాలని చూస్తున్నారు. కానీ, ఓ మాజీ అధికారికి విషయం తేడాగా కనపడటంతో మిగితా ఆఫీసర్స్ ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో పడ్డారు.
– దేవేందర్ రెడ్డి, 9848070809