6th phase lok sabha election upto 1 pm 34.37 percent voting held in 6 states :
లోక్ సభ ఎన్నికల్లో భాగంగా ఆరవ దశ పోలింగ్ శనివారం ఉదయం 7 గంటలకు మొదలైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. దీని కోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఓటింగ్ సజావుగా, ప్రశాంతంగా జరిగేలా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 889 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 11.13 కోట్ల మంది ఓటర్లు ఆరో దశలో ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 5.84 కోట్ల మంది పురుషులు, 5.29 కోట్ల మంది మహిళలు, 5,120 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. దాదాపు 11.4 లక్షల మంది పోలింగ్ సిబ్బంది సేవలు అందిస్తున్నారు. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో మధ్యాహ్నం 1 గంట వరకు నమోదైన పోలింగ్ శాతం 39.13. బీహార్లో 36.48 శాతం, హర్యానా లో 36.48 శాతం, జమ్మూ అండ్ కాశ్మీర్ లో 35.22 శాతం, ఝార్ఖండ్ లో 42.54 శాతం, ఢిల్లీ లో 34.37 శాతం, ఒడిశా లో 35.69 శాతం, ఉత్తర ప్రదేశ్ లో 37.23 శాతం, పశ్చిమబెంగాల్ లో 54.80 శాతం నమోదయింది. ఆరవ దశ ఎన్నికల్లో ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలలోని 58 నియోజకవర్గాల్లో ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయి. ఉదయం 11 వరకు దాదాపు 25.76 శాతం పోలింగ్ జరిగింది.
ఓటేసిన ప్రముఖులు
ఆరవ దశ ఎన్నికలలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఢిల్లీలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రియాంకగాంధీ, ఆమె కుమార్తె, కుమారుడు ఢిల్లీలోనే ఓటు వేశారు. మాజీరాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, రాంచీలో తెలంగాణ గవర్నర్ రాధాక్రిష్ణన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం కేజ్రీవాల్, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ ఢిల్లీలో ఓటు వేశారు. భవనేశ్వర్‌లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్, కేంద్ర మంత్రి హర్‌దీప్ సింగ్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ఆయన సతీమణి సుదేశ్, హర్యానా సిఎం నాయబ్ సింగ్ సైనీ, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, లోక్ సభ అభ్యర్థి బన్సూరీ స్వరాజ్, ఢిల్లీ మంత్రులు సౌరభ్ భరద్వాజ్, ఆతిశీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్, మాజీ సిఇసి సుశీల్ చంద్ర, తదితరలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మాజీ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఆరవ దశ ఎన్నికల్లో తన ఓటును జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాంచీలో వినియోగించుకున్నారు.