- నాలుగవ దశ సార్వత్రిక ఎన్నికలకు సర్వం సిద్ధం
- ఏపీలో ఓటర్ల సంఖ్య 4.08 కోట్లు
- తెలంగాణలో 3,34 మంది ఓటర్లు
- స్వాతంత్య్రం వచ్చాక జరిగిన తొలి ఎన్నికలలో ఓటర్ల సంఖ్య 13 కోట్లు
- నేడు 97 కోట్లకు పెరిగిన ఓటర్ల సంఖ్య
- దేశ జనాభాలో దాదాపు 70 శాతం మంది ఓటర్లు
- రాజీవ్ గాంధీ చొరవతో 21 నుంచి 18 సంవ్సరాలకు ఓటింగ్ వయసు కుదింపు
- నగరాలలో తగ్గిపోతున్న ఓటేసేవారి సంఖ్య
- విజ్ణతతో ఓటెయ్యవలసిన సమయం ఆసన్నం
4th phase parliamentary elections two telugu states voters responsibility:
ప్రజాస్వామ్యపు బలమైన సౌధానికి పునాది ఓటుహక్కు. పునాది ఎంత బలంగా ఉంటుందో భవనం అంత బలంగా ఉంటుంది. జాతి నిర్మాణంలో పాలు పంచుకునే బాధ్యతగల ప్రతి ఓటరూ ఓటెయ్యడానికి ఆసక్తి కనబరుస్తాడు. అలాంటి విజ్ఞత కలిగిన ఓటరు చూపుడు వేలిపై మెరిసే సిరాచుక్కే అత్యంత శక్తివంతమైన వజ్రాయుధం. ఏడంచెల సార్వత్రిక సమరంలో భాగంగా నేడు నాలుగవ దశ పోలింగ్ జరగనుంది. 18వ లోక్ సభతో పాటు ఏపీ, ఒడిశా, సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో 42 లోక్ సభ స్థానాలు, ఆంధ్రాలో 175 అసెంబ్లీ, తెలంగాణ శాసనసభ ఉప ఎన్నిక కు పోలింగ్ జరుగనున్నాయి. ఇక ఈ ఎన్నికలలో ఏపీలో 4.08 కోట్లు, తెలంగాణలో 3.34 కోట్ల ఓటర్లు అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు.
గతంలో కన్నా 15 కోట్లకు పెరిగిన ఓటర్లు
స్వాతంత్య్రం వచ్చాక తొలి ఎన్నికలలో మొత్తం ఓటర్లు కేవలం 13 కోట్ల మందే. నేడు ఆ సంఖ్య దాదాపు 97 కోట్లు దాటింది. దేశ జనాభాతో పోల్చుకుంటే దాదాపు 70 శాతం ఓటర్లు ఉన్నట్లు లెక్క. అయితే 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలతో పోల్చుకుంటే 15 కోట్ల ఓటర్ల సంఖ్య పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఎన్నికలలో వికలాంగులు, 85 ఏళ్లు పైబడిన ఓటర్లు తమ ఇంటినుంచే ఓటు వేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం తొలిసారి అనుమతించింది. ఇక మండుటెండలు దృష్ట్యా ఓటర్లకు అనుకూల సమయంలో వచ్చేలా తెలంగాణలో పోలింగ్ ప్రక్రియను మరో గంటపాటు సడలించారు. మొదటినుంచి ఓటు హక్కును 21 సంవత్సరాలుగా ఉండేది. 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 18 ఏళ్లకే ఓటుహక్కు కల్పించిన ఘనత నాటి ప్రధాని రాజీవ్ గాంధీకే దక్కుతుంది. దేశంలో యువత పట్ల మనకు గల పరిపూర్ణ విశ్వాసానికి ఇది తార్కాణమని రాజీవ్ గాంధీ వ్యాఖ్యానించారు. రాజీవ్ గాంధీ దూరదృష్టికి ఇది ఒక మచ్చుతునక అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన ఆలోచనలెప్పుడూ నెక్ట్స్ జనరేషన్ విజన్ అంటుండేవారు. ఎందుకంటే 140 కోట్ల మందికి పైగా ఉన్న జనాభాలో 25 ఏళ్ల లోపు యువత సగంపైనే ఉండటం భారత దేశ ప్రత్యేకత.అయితే ఈ సారి జరగబోయే ఎన్నికలలో 18-19 సంవత్సరాల వయస్సు కలిగి తొలి సారి ఓటు వేయనున్న ఓటర్లు దాదాపు 3 కోట్లకు పైగా ఉన్నారని అంచనా. అయితే ఈ ప్రజాస్వామ్య ప్రక్రియలో ఎంతమంది భాగస్వాములవుతున్నారనే ప్రశ్న వెంటాడుతూనే ఉంది.
2014లో అత్యధిక శాతం పోలింగ్
ఇప్పటివరకూ 2014లోనే అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది. అదీ కేవలం 66.4శాతమే. ఆ ఎన్నికల్లో 27కోట్ల మందికిపైగా ఓటుహక్కు వినియోగించు కోలేదు. సంపన్నులు, విద్యావంతులు, ఎగువ మధ్యతరగతివారిలో అత్యధికులు ఓటింగ్‌కు దూరంగా ఉంటున్నట్లు విశ్లేషకులు చెపుతున్నారు.అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చేయడంలో ఎన్నికల సంఘం వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కొందరు ఓటు వేయకపోతే ఏంలే అనే నిరాసక్తత వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యానికి తీరని ద్రోహం చేయడమే. ఈసారి తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది ఓట్లు గల్లంతైనట్లు, కొన్ని చోట్ల దొంగ ఓట్లు పెద్ద సంఖ్యలో చేర్పించినట్లు, ఒకే ఇంట్లో వందల సంఖ్యలో ఓట్లు ఉన్న సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ అప్రజాస్వామిక అధికార దుర్వినియోగ దుష్కార్యంలో పాలక పార్టీల పాత్ర ముఖ్యంగా ఎన్నికల కమిషన్ అనుసరిస్తున్న తీరు ఎన్నికల కమిషన్ విశ్వసనీయతనే ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పార్టీకి వ్యతిరేకంగా ప్రధానమంత్రి నిచాతినీచమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ ఉదాసీన ధోరణి ప్రదర్శించడం, ఇప్పటికే ముగిసిన మొదటి రెండు దశల్లో పోలైన ఓట్ల శాతాన్ని ప్రకటించడంలో చేసిన జాప్యంతో ఎన్నికల కమిషన్ తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నది. ఎన్నికల కమిషన్ ఈ విధమైన చర్యలు, ప్రజాస్వామ్యమంటే ఎలాగైనా తామే అధికారంలోకి రావడం అని భావించే నాయకుల వల్లే ఎన్నికల ప్రక్రియపై సామాన్యులకు విశ్వాసం సన్నగిల్లుతోంది. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలున్నప్పటికీ దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే శాసన వ్యవస్థకు చోదకశక్తి అయిన రాజకీయ రంగం నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తి, చైతన్యాన్ని ప్రకటించకపోతే మిగతా వ్యవస్థలు కూడా భ్రష్టుపడుతాయి. ఆ దృశ్యాన్ని కూడా మనం కేంద్రంలో గత పదేళ్లగా, రాష్ట్రంలో అయిదేళ్లలో చాలా స్పష్టంగా చూస్తూనే ఉన్నాం.
విజ్ణతతో ఓటెయ్యాలని మేధావుల వినతి
కొందరు నేతలు బలమైన రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి దాదాపు నిరంకుశ పాలనను కొనసాగించారు. ఎంతో బాధ్యతతో వ్యవహరించి, రాజ్యాంగ వ్యవస్థల పనితీరుపై సునిశిత ఆలోచన చేసి, దేశాన్ని ప్రపంచానికి మార్గదర్శకంగానూ, మనకు మనం సచ్ఛీలతతో జీవించేలానూ చూడాల్సిన పాలకులు, నేడు ఆ కర్తవ్యాన్ని విస్మరించి అప్రజాస్వామ్యానికి, సమస్త అక్రమాలకు పాల్పడుతున్నారు. కొందరు ఓటర్ల నిస్పృహ, అలసత్వం కారణంగా అభ్యర్థుల గెలుపోటములు తారుమారైన ఉదంతాలు ఎన్నో! కాబట్టి ఒత్తిడులకు, ప్రలోభాలకు, క్షణికమైన ఎరలకు ఆకర్షితులై ఓటును అమ్ముకోడమో, తప్పుడు నిర్ణయానుసారం వినియోగించడమో జరిగితే తమ భవిష్యత్తు, దేశ భవిష్యత్తు అనర్హులు, అసమర్థులు, అవినీతిపరుల చేతిలోకి జారిపోతుంది. ఈ తప్పుకు అయిదేళ్లపాటు పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. రాష్ట్ర, దేశ భవిష్యత్తు అయోగ్యుల పాల్బడకుండా వివేచనతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి. బలహీనులకు బలవంతులతో సమానమైన అవకాశాలు కల్పించేదే ప్రజాస్వామ్యమని గాంధీజీ అన్నారు. అటువంటి మహత్తర స్థితికి సూచి ఓటు. ఈ కీలక సమయంలో ఓటును సద్వినియోగం చేసుకోడమే ఏకైక కర్తవ్యం. ఓటరు స్థాయిలో విజ్ఞతే మహోజ్జ్వల భవితకు సరైన పునాది.