Temperature: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు అనూహ్యంగా పెరిగాయి. ఏప్రిల్ నెల తొలివారంలోనే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు పెరిగాయి. కొన్ని చోట్ల 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా రికార్డ్ అయ్యాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకూ ఎండలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. మధ్యాహ్నం గడప బయట అడుగు పెట్టాలంటే జంకుతున్నారు. ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
తెలంగాణలో ఒకట్రెండు జిల్లాలు మినహా ప్రతి జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. నల్లగొండ, ఖమ్మం, నిర్మల్, జగిత్యాల, గద్వాల, ఆదిలాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో బుధవారం ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలను దాటాయి. నల్లగొండలోని నిడమనూరులో 43.5 డిగ్రీలు నమోదయ్యాయి. రానున్న మూడు రోజుల్లో అక్కడక్కడ ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నదని ఐఎండీ అంచనా వేసింది. శుక్ర, శనివారాల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే ఆస్కారం ఉన్నదని తెలిపింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉన్నదని పేర్కొంది. ఆది, సోమవారాల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వివరించింది.
Also Read: ఎన్నికల బరిలో రఘురామ! చక్రం తిప్పింది జగనా? చంద్రబాబా?
సాధారణంగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎండలు ఎక్కువ కొడతాయి. అత్యధికంగా మే నెలలో ఎండలు ఉంటాయి. సాధారణంగా మే నెలలోనే ఎండలు 40 నుంచి 47 డిగ్రీలకు అటూ ఇటూగా నమోదవుతూ ఉంటాయి. కానీ, ఈ ఏడాది ఏప్రిల్ తొలి వారంలోనే ఇక్కడ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలను అందుకుంటున్నాయి. ఇదే మోతాదులో ఉష్ణోగ్రతలు పెరుగుతూ పోతే మాత్రం మే నెలలో మాడు పగిలేలా ఎండలు కొట్టడం ఖాయం. ఏటికేడు ఎండలు పెరుగుతూనే వస్తున్నాయి. అమెరికాకు చెందిన సంస్థ క్లైమేట్ గత 50 ఏళ్ల రికార్డులను పరిశీలిస్తే.. ఈ కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు పెరిగాయని తేలింది. వేగంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న రాష్ట్రాల జాబితాలో తెలుగు రాష్ట్రాలూ ఉన్నాయి.
Also Read: టీడీపీకి పవన్ వరం.. బీజేపీ శాపం.. బాబు ఫ్యూచర్ ఏంటో?
మండే ఎండలతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వీలైనంత మేరకు పగలు ఇంటికే పరిమితం కావలని చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, పిల్లలు, బాలింతలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేశారు. డీహైడ్రేట్ కాకుండా నీరు ఎక్కువగా తీసుకోవాలని, అవసరమైతే ఓఆర్ఎస్ ద్రావణం, లస్సీ, కొబ్బరి నీరు వంటివి తీసుకోవాలని సూచిస్తున్నారు.