– ఫలితాలు వెలువడ్డ మరుసటి రోజే చేరికలు
– బీఆర్ఎస్ దుకాణం ఖాళీ కావడం ఖాయం
– నామినేషన్ వేసిన ఆరుగురు బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా రెడీ
– నన్ను సంప్రదించారు కూడా
– డీలిమిటేషన్ తర్వాత తెలంగాణలో 154 సీట్లు
– 125 సీట్లల్లో కాంగ్రెస్ విజయం తథ్యం
Minister Komatireddy: మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్ చేస్తూ సంచలన విషయాలను వెల్లడించారు. లోక్ సభ ఎన్నికల పర్వం ముగిశాక బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు ఉంటాయని తెలిపారు. జూన్ 5వ తేదీన 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని కుండబద్దలు కొట్టారు. బీఆర్ఎస్ దుకాణం ఖాయం అని అన్నారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ పై పోటీ చేస్తున్న ఆరుగురు అభ్యర్థులు కూడా కాంగ్రెస్‌లో చేరడానికి తనను సంప్రదించారని కోమటిరెడ్డి తెలిపారు. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతుందని చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మన రాష్ట్రంలో శాసన సభ స్థానాల సంఖ్య 154కు పెరుగుతుందని అంచనా వేశారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ 125 సీట్లు గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి కోమటిరెడ్డి సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో చిట్ చాట్ చేశారు.
తాను ఏ రైతునూ విమర్శించలేదని, అన్నదాతలంటే తనకు అపారమైన ప్రేమ అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. తాను రైతులను తిట్టినట్టు నిరూపిస్తే ఏ నిర్ణయానికైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. మోదీకి లెక్కలు రావా? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులైంది? అని సీరియస్ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితి నుంచి ఒకటో తారీఖున జీతాలు ఇచ్చే స్థాయికి తీసుకువచ్చామని వివరించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఒక్క టెండర్ కూడా పిలువలేదని తెలిపారు. ఇవన్నీ మోదీకి కనిపించడం లేదా? అని నిలదీశారు. తమది ఆర్ఆర్ ట్యాక్స్ కాదని, కానీ, వాళ్లది డబుల్ ఏ ట్యాక్స్ అని అన్నారు. అందానీ, అంబానీలకు డబ్బులు కట్టబెడుతున్నారని పేర్కొన్నారు.
Also Read: కొవిడ్ టీకాను ఆస్ట్రాజెనెకా ఎందుకు ఉపసంహరించుకుంది?
ఉత్తరాదిలో బీజేపీపై వ్యతిరేకత పెరిగిందని, అందుకే దక్షిణాదిలో ఓట్ల కోసం మోదీ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయని చెప్పిన మంత్రి ఇందులో ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవాలని సూచన చేశారు. రెండు సార్లి బ్లాక్ మనీ తెస్తానని చెప్పి ఇప్పుడు మోదీ రామ జపం చేస్తున్నారని మండిపడ్డారు. అదానీ, అంబానీ చేతుల్లో దేశ సంపద పెట్టారని, మరోసారి మోదీ పీఎం అయితేమాత్రం శాశ్వత ప్రధానిగా ప్రకటించుకుంటారు. బీజేపీకి చెప్పడానికేమీ లేదని, అందుకే ఈ ఎన్నికల్లో ఆ పార్టీ హిందూ, ముస్లిం అంటూ రెచ్చగొడుతున్నదని మండిపడ్డారు.
వచ్చే పదేళ్లు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డే ఉంటారని, వైఎస్ తరహాలోనే రేవంత్ రెడ్డి కూడా సింపుల్‌గా ఉంటారని మంత్రి తెలిపారు. ప్రతి మంత్రికి, ఎమ్మెల్యేలకు సముచిత గౌరవాన్ని ఇస్తారని వివరించారు. బిడ్డ కవితను బయటికి తేవడానికి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని, మోదీతో ఒప్పందం పెట్టుకున్నారని అన్నారు. కేసీఆర్ డిపాజిట్ల కోసమే బస్సు యాత్ర చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ను ఫుట్‌బాల్ ఆడుకుంటానన్న తలసాని శ్రీనివాస్ మంత్రి అయ్యాడని, గొర్రెలు, బర్రెలు, చేపలు తిన్నాడని ఆరోపించారు.