2024 Election rules in Hyderabad insisted by police commissioner:
మరో 48 గంటల్లో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. శనివారం సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది. అయితే హైదరాబాద్ లో పోలీసులు రెండు రోజుల పాటు ఆంక్షలు విధించారు. 11 సాయంత్రం నుంచి 14 ఉదయం 6 గంటల వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉంటాయంటున్నారు. నగర పరిధిలో ఇద్దరు కన్నా ఎక్కువగా గుమిగూడటంపై ఆంక్షలు విధించారు. ఈ మేరకు పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. పోలింగ్ జరిగే సోమవారం పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఇక శనివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకూ అన్ని రకాల ప్రచార కార్యక్రమాలపై నిషేధం అమల్లో ఉంటుందని తెలియజేశారు. అలాగే మద్యం విక్రయాలపైనా కఠిన ఆంక్షలు ఉంటాయన్నారు. వారికి ఎలాంటి లైసెన్సులు ఉన్నా అనుమతించబోమన్నారు. పోలింగ్ రోజున పురుషులు, మహిళలకు వేర్వేరు లైన్లు ఉంటాయన్నారు. ఇక రెండు లైన్లకు మాత్రమే అనుమతి ఉంటుందని…అంతకు మించి అనుమతించబోమన్నారు. రోడ్డు మీద 5 మంది కన్నా ఎక్కువగా గుమిగూడకూడదన్నారు. బహిరంగ ప్రదేశాలలో షామియానాలు, పందిళ్లు వంటివి వేయడానికి కూడా అనుమతి లేదన్నారు. మైకులు, స్పీకర్లు అస్సలు అనుమతించబోమని అన్నారు. అందుకు విరుద్ధంగా ప్రవర్తించినవారిపై కఠిన చర్యలుంటాయన్నారు.
మద్యం డ్రై డే
వ్యక్తిగతంగా, వర్గాల వారీగా విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించకూడదని, వాళ్లకు వ్యతిరేకంగా రాసే రాతలు, ప్లకార్డులు అనుమతించబోమన్నారు. అలాగే ఎన్నికల గుర్తులతో ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించడాన్ని సీరియస్ గా తీసుకుంటామన్నారు. ఆత్మరక్షణ కోసం కర్రలు, తుపాకులు, మారణాయుధాలు వినియోగించడంపై నిషేధం విధించామన్నారు. మద్యం, కల్లు, సారాయి దుకాణాలు, బార్లు, మద్యం అమ్మే రెస్టరెంట్లు అన్నింటినీ రెండు రోజుల పాటు మూసి ఉంచాలన్నీరు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగిసినప్పటి నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ఓట్ల లెక్కింపు రోజున మద్యం దుకాణాలు తెరవరాదని స్పష్టం చేశారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు రోజున సాయంత్రం 5 గంటల వరకు మూసి వేయాలని ఆదేశించారు. ఒకవేళ రీపోలింగ్ ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో సాయంత్రం 6 వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని వెల్లడించారు. మద్యం డ్రై డేను కచ్చితంగా అమలు చేయాలని ఎక్సైజ్ శాఖకు సీఈవో స్పష్టం చేసింది