– అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లో అసెంబ్లీకీ పోలింగ్
-చెన్నైసౌత్ బరిలో తమిళి సై, కోయంబత్తూరు నుంచి అన్నామలై
– చింధ్వారా బరిలో కమల్ నాథ్ తనయుడు నకుల్
102 Seats 16 Crore Voters Stage Set For First Phase Of ls Polls: ఏడు విడతలుగా జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో భాగంగా నేటి ఉదయం పోలింగ్ ప్రారంభం కానుంది. తొలిదశలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్. మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్, అండమాన్- నికోబార్ దీవులు, జమ్మూ కాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరి రాష్ట్రాల్లోని 102 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుండగా, మొత్తం 1625 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2019లో ఈ 102 నియోజకవర్గాల్లో 45 స్థానాల్లో యుపీఏ అభ్యర్థులు విజయం సాధించగా.. 41 నియోజకవర్గాల్లో ఎన్డీయే అభ్యర్థులు గెలిచారు. లోక్‌సభ ఎన్నికలతో బాటు అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలోని 60 స్థానాల్లో 50 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక్కడ 10 స్థానాలకు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక అయిన విషయం తెలిసిందే. మరోవైపు సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకూ రేపు పోలింగ్ జరగనుంది.
నేటి పోలింగ్ జరిగే ప్రదేశాల్లో మొత్తం 8మంది మంత్రులు, ఇద్దరు మాజీ సీఎంలు, ఒక గవర్నర్ బరిలో ఉన్నారు. ఇక రేపు ఎన్నికల బరిలో ఉన్న నాయకుల జాబితాను గమనిస్తే… నాగ్‌పుర్ స్థానం నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి, అరుణాచల్ వెస్ట్ నుంచి మరో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు, డిబ్రూగఢ్ స్థానం నుంచి శర్బానంద సోనోవాల్, అర్జున్ మేఘవాల్, ఎల్.మురుగన్ వంటి నేతలు బరిలో ఉన్నారు. త్రిపురలో రెండు స్థానాలుండగా, వెస్ట్ త్రిపుర నుంచి మాజీ సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ పోటీ చేస్తున్నారు.
Also Read: లక్ష్మణ్ ల్యాండ్ అయితే నక్సల్స్ కు బ్యాండే
తమిళనాడులో పలువురు ప్రముఖులు రేపు జరగనున్న పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. చెన్నైసౌత్ నియోజకవర్గం నుంచి తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పోటీ చేస్తున్నారు. శివగంగ నియోజకవర్గం నుంచి కార్తి చిదంబరం, కోయంబత్తూరు నియోజకవర్గం నుంచి బీజేపీ స్టార్ క్యాంపెయినర్ కె.అన్నామలై, సెంట్రల్ చెన్నై నియోజకవర్గం నుంచి కేంద్ర మాజీమంత్రి దయానిధి మారన్ ఉన్నారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారా నియోజకవర్గం నుంచి మాజీ సీఎం కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ బరిలో నిలవగా, యూపీలోని సహారాన్‌పూర్ నియోజకవర్గం నుంచి ఇమ్రాన్ మసూద్ బరిలో నిలిచారు.