ప్రజాస్వామ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ పరమైన వైరాలు సాధారణమే. కానీ.. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేంద్రంతో సన్నిహిత సంబంధాలు నెలకొల్పువాల్సిన బాధ్యత మాత్రం రాష్ట్రానిదే. అప్పుడే, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కొత్త ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఎంతో కొంత పురోగతి సాధ్యమవుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఈ విషయలో మరింత చొరవ చూపాల్సి ఉంటుంది. 2014లో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర విషయంలో ఇందుకు భిన్నంగా జరగటంతో రాష్ట్రం ఈ పదేళ్ల కాలంలో ఎంతో కోల్పోయింది.
తెలంగాణలో గులాబీపార్టీ గెలిచి సీఎం కేసీఆర్ అయిన సమయంలోనే కేంద్రంలో నరేంద్రమోదీ ప్రధాని అయ్యారు. తెలంగాణ ఏర్పాటు సందర్భంగా నాటి యూపీయే ఇచ్చిన హామీలు, పునర్విభజన చట్టంలో అమలు కావాల్సిన అంశాల గురించి తొలినాళ్లలో అటు కేంద్రం, ఇటు రాష్ట్రం మధ్య చర్చలు జరిగేవి. తొలినాళ్లలలో మోదీ, కేసీఆర్ మధ్య చక్కని వాతావరణమే ఉండటంతో అందరూ సంతోషపడ్డారు. అప్పట్లో కేంద్రంలో మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు ఎప్పటికప్పుడు పెండింగ్ సమస్యలను పరిష్కరించే దిశగా చొరవ చూపుతూ వచ్చారు. తొలినాళ్లలో మోదీ చేసిన నోట్ల రద్దు తదితర పెద్ద నిర్ణయాలను కేసీఆర్ స్వాగతిస్తూ వచ్చినా.. నీతి ఆయోగ్ సమావేశాల్లో తగిన ప్రాధాన్యం లభించకపోవటం, ఐటీఐఆర్ తెలంగాణకు దక్కకపోవటం, ఉచిత పథకాలకు అవసరమైన నిధుల విషయలో కేంద్రం పరిమితులు విధించటం, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచాలని కోరిన కోరిక నెరవేరకపోవటం, రెండో దఫా గెలిచాక కుమారుడిని సీఎంగా చూడాలన్న కేసీఆర్ కోరికకు కేంద్ర పెద్దలు ‘మీ ఇష్టం’ అనకపోవటంతో కేంద్రం మీద కేసీఆర్ కత్తిగట్టారు.
కేంద్రం మీద తన నిరసనను తెలిపే క్రమంలో నీతిఆయోగ్ మీటింగ్‌కు, రాష్ట్రాల సీఎంతో ప్రధాని నిర్వహించే అన్ని సమావేశాలకు కేసీఆర్ వెళ్లటం మానేశారు. కొవిడ్ కాలంలోనూ బెట్టు వీడలేదు. ఆ సమయంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లకు సైతం ఆయన డుమ్మా కొట్టారు. వ్యాక్సిన్ తయారీపై సైంటిస్టులతో భేటీ కోసం 2020 నవంబర్ 28న ప్రధాని మోదీ భారత్ బయోటెక్‌కు వచ్చినప్పుడూ 2022 ఫిబ్రవరి 5న ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని వచ్చినప్పుడు సీఎం హోదాలో ప్రధానిని స్వాగతించలేదు. 2022 మే 26న ఐఎస్‌బీ 20వ కాన్వొకేషన్‌కు వచ్చిన ప్రధానికి ఆయన స్వాగతం పలకలేదు. పైగా అదే రోజు జేడీఎస్ నేతలతో భేటీ అయ్యేందుకు కేసీఆర్ బెంగళూరుకు వెళ్లారు. 2022 జులై 1 నుంచి 3 వరకు హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం రోజున బేగంపేట వచ్చిన ప్రధానికి స్వాగతం పలకకపోగా, సరిగ్గా రెండు గంటల ముందు అదే బేగంపేటకు రాష్ట్రపతి ఎన్నికలో పోటీచేసిన యశ్వంత్ సిన్హాకు ఎదురేగి స్వాగతం పలికి, వేలాదిమందితో ర్యాలీగా ప్రగతి భవన్‌కు తీసుకొచ్చారు. 2022 నవంబర్ 12న రామగుండంలోని ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ప్రధాని వస్తే ఆహ్వానించకపోగా.. వామపక్షాలతో కలిసి బీఆర్‌ఎస్ నేతలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. 2023 జనవరి 19న వందే భారత్ రైలు ప్రారంభోత్సవానికి మోదీ వచ్చినప్పుడూ కేసీఆర్ రాలేదు. ఢిల్లీలో సీజేఐ జస్టిస్ రమణ నేతృత్వంలో విజ్ఞాన్ భవన్‌లో హైకోర్టు సీజేలు, ముఖ్యమంత్రుల సంయుక్త సమావేశం జరిగిన సందర్భంలోనూ నాటి సీఎం డుమ్మాకొట్టారు.
ఇంతటితో ఆగకుండా తన శక్తిని మరచి, అనేక అనవసర వివాదాల్లో నాటి సీఎం తలదూర్చి తెలంగాణ ప్రజల దృష్టిలో ప్రధానిని విలన్‌గా నిలిపే ప్రయత్నాలూ చేశారు. ముఖ్యంగా, ఢిల్లీ పాలనా వ్యవహారాల్లో కేంద్రం పెత్తనాన్ని నిరసిస్తూ సుప్రీంకోర్టు తీర్పుచెప్పిన వేళ, కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ఆప్ ప్రభుత్వానికి మద్దతుగా తెలంగాణ సీఎం కేసీఆర్ వెళ్లి సమాఖ్య వ్యవస్థ గురించి ఉపన్యాసాలిచ్చారు. రాజకీయ పరమైన కారణాలతో ఆయన ఆప్‌కు మద్దతుగా నిలవటాన్ని ఎవరూ తప్పుబట్టరు. కానీ, ఇదే కేసీఆర్ ఇదే వ్యక్తి ఢిల్లీ లిక్కర్ స్కాంలో కుమార్తె కవిత పేరు రాగానే, తెలంగాణలోకి సీబీఐ ఎంటర్ కాకుండా జీవో తేవటమే గాక రాష్ట్రంలో సీబీఐ విచారణకు ఇచ్చిన జనరల్ కాన్సెంట్ విత్‌డ్రా చేసుకున్నారు. అంతేకాదు.. తన ప్రభుత్వంలోని మంత్రులు, ముఖ్య నాయకులు, వ్యాపారవేత్తలు, బడా పారిశ్రామికవేత్తల మీద ఐటీ, ఈడీ దాడులు మొదలు కాగానే.. తెలంగాణలో పనిచేస్తు్న్న కేంద్ర ఉద్యోగుల మీద ఏసీబీ దాడులు చేస్తామంటూ వ్యాఖ్యానించారు. రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే నాడు గవర్నర్ ఆతిథ్యమిచ్చే ఎట్ హోం కార్యక్రమానికి కూడా అప్పటి ముఖ్యమంత్రి, మంత్రులు వెళ్లకుండా దూరంగా ఉన్నారు.
కేంద్రం అవలంబిస్తున్న ఆర్థిక విధానాల వల్ల దేశం నష్టపోతోందని, జీఎస్టీ విషయంలో కేంద్రం వైఖరిని నిలదీసిన కేసీఆర్ కాళేశ్వరం మొదలు అనేక పథకాలకు, ఎవరి అనుమతి లేకుండా రెండు లక్షల కోట్ల రూపాయలను విడుదల చేయించారు. నీటి వాటాల పంపిణీ మీద ఉపన్యాసాలిచ్చిన నాటి సీఎం, ఇరుగుపొరుగు రాష్ట్రాలతో ఏనాడూ నదీ జలాల గురించి ఒక్క సమావేశమూ ఏర్పాటు చేసిన పాపాన పోలేదు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల అంశంపై కేంద్రాన్ని ఇరుకునపెడుతూ గులాబీ పార్టీ ఆధ్వర్యంలో పోరుబాట పట్టిన కేసీఆర్, రాష్ట్రానికి వచ్చిన మహిళా గవర్నర్ మీదా కాలు దువ్వారు. నాటి సీఎం అండతో…‘గవర్నర్ బీజేపీ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారు’ అంటూ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మాట్లాడి, జాతీయ మహిళా కమిషన్ ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సి వచ్చే స్థితి తెచ్చుకున్నారు.
దీనికారణంగా కేంద్రం అమలు చేస్తు్న్న 114 సంక్షేమ పథకాల్లో ఏదీ రాష్ట్ర ప్రజలకు అందుబాటులో లేకుండా పోయాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోతే రైతులకు ఎకరానికి రూ. 5 నుంచి 25 వేలు సాయం అందించే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను, ప్రీమియం ఎక్కువగా ఉందంటూ నాటి తెలంగాణ ప్రభుత్వం తిరస్కరించటంతో తెలంగాణ రైతాంగం నష్టపోయింది. దేశవ్యాప్తంగా ఒక కుటుంబానికి రూ.5 లక్షల ఆరోగ్య బీమాను అందించే ఆయుష్మాన్ భారత్ పథకాన్ని దిక్కుమాలినదంటూ ఎగతాళి చేసిన కేసీఆర్, రాష్ట్రంలో సమర్థవంతంగా పేరున్న రాజీవ్ ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేశారు. ఇక.. కేంద్రం అందించే పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన, పీఎం కిసాన్, అటల్ పెన్షన్ యోజనల గురించి తగిన ప్రచారం కల్పించకుండా ఉపేక్షించారు. ఏ గ్యారెంటీ లేకుండా కొత్తగా వ్యాపారం చేసుకునే వారికి అందించే ముద్రా రుణాల గురించీ పట్టించుకోలేదు. రైల్వే లైన్ల నిర్మాణంలో భూసేకరణకు రాష్ట్రం రవ్వంత సహకారం అందించలేదు.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద వచ్చిన నిధులతో గతంలో కాంగ్రెస్ లక్షలాది ఇందిరమ్మ ఇళ్లు నిర్మించింది. అయితే.. వాటిని డబ్బా ఇళ్లుగా ఎగతాళి చేసిన కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కడతానని ప్రకటించారు. పీఎం ఆవాస్ యోజన కింద ఏదైనా రాష్ట్రం లబ్ధిదారులను ముందుగా గుర్తించి జాబితాను పంపితే నిధులు జారీ చేస్తుంది. 2016-17లో రూ.190.79 కోట్లు, 2017-18లో రూ.1120.7 కోట్ల చొప్పున రెండేళ్లలో రూ.1,311 కోట్లను కేంద్రం తెలంగాణకు ఇచ్చింది. లబ్దిదారుల జాబితా పంపాలనే నిబంధన నచ్చని కేసీఆర్ ఆ తర్వాత ఏ జాబితానూ పంపకపోవటంతో తెలంగాణలోని నిరుపేదలకు సొంతింటి కల దూరమైంది.
వరంగల్ స్మార్ట్ సిటీకి కేంద్రం నిధులు కేటాయించినా, రాష్ట్రం వాటా నిధులిచ్చేందుకు ముందుకు రాకపోవటం, హృదయ్ ప్రాజెక్టు కింద భద్రకాళి చెరువు అభివృద్ధికీ ఆసక్తి చూపకపోవటం, కాజీపేట రైల్వే కర్మాగారానికి భూమిని కేటాయింపుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ వచ్చారు. చివరకు బయ్యారంలో ఉక్కు కర్మాగారం విషయంలోనూ వాస్తవికతను మరచి రాజకీయ ప్రయోజనాలకే పెద్దపీట వేశారు. ఐటీఐఆర్‌ను హైదరాబాద్‌కు దక్కకుండా చేశారని ఆరోపించిన గులాబీ బాస్.. తాను ప్రారంభించిన ఫార్మా సిటీని పట్టించుకున్న పాపానే పోలేదు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వానికి భిన్నంగా, కేంద్రంతో సత్సంబంధాలను నెలకొల్పుతూ మంచి సంప్రదాయాన్ని పాటిస్తోంది. అవకాశం వచ్చినప్పుడల్లా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం ముందుంచి కేంద్ర సాయం పొందే యత్నం చేస్తున్నారు. సీఎం రేవంత్ చొరవ చూపి, రక్షణ శాఖ అధికారులతో మాట్లాడటంతో ఆర్మీ వారు ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయటంతో ఏళ్లకేళ్లుగా పెండింగ్‌లో ఉన్న మెహిదీపట్నం స్కై వాక్ పూర్తి చేసే వీలు కలిగింది. తెలంగాణకు అదనంగా ఐపీఎస్ పోస్టులు కావాలని హోం మంత్రి అమిత్‌షాను కోరగా, అదీ నెరవేరింది. మూడేళ్లుగా రిపబ్లిక్ డే పెరేడ్‌లో కనిపించని తెలంగాణ శకటం రేవంత్ సర్కారు చొరవతో ఈసారి దర్శనమిచ్చింది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేస్తూనే, ఆ ప్రాజెక్టుకు పీఎంకేఎస్వైలో ఆర్థిక సాయం అందించేందుకు వీలుందని, దానికి అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని రాష్ట్రానికి కేంద్రం సూచించింది.
గతంలో రాష్ట్రం జమ చేయాల్సిన మ్యాచింగ్ గ్రాంటు నిధులను తాజాగా తెలంగాణ సర్కారు సమకూర్చటంతో గ్రామ పరిశుభ్రత కార్యక్రమానికి రూ.100 కోట్లు మంజూరయ్యాయి. పట్టణాల్లో అభివృద్ధి పనులు, సంస్కరణలకు రూ. 1,500 కోట్లు కేటాయించాలని ఇటీవలే కేంద్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు తెలంగాణ సీఎం విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు పనుల విషయంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో ఉన్న పేచీల గురించి సీఎం.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి జరిపి చర్చించటంతో రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం పనులకు లైన్ క్లియర్ అయింది. తెలంగాణ ప్రభుత్వం వినతిని మన్నించి గత వారం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాండ్లూమ్ టెక్నాలజీ సంస్థను కేంద్రం మంజూరు చేసింది. అతి తక్కువ సమయంలో కొత్త ప్రభుత్వం చూపిన చొరవ కొత్త మార్పుకు నాంది పలుకుతోంది. ప్రజల పక్షాన పాలనా బాధ్యతలు నిర్వహించే వ్యక్తి రాజకీయాల పరిమితిని అధిగమించి, విశాల రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలనే పెద్దల మాటను గౌరవించి, ఆ బాటలో సాగుతున్న నేటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వపు ముందుచూపును అందరూ స్వాగతిస్తున్నారు. ఈ విజ్ఞత, విశాల దృక్పథం, దూరదృష్టి మాత్రమే తెలంగాణకు దేశవ్యాప్తంగా ఒక గుర్తింపును, గౌరవాన్ని తెస్తాయని నేటి పాలకులు భావించటం ఎంతో సంతోషించాల్సిన విషయం.