తెలంగాణ నిరుపేద గ్రామీణ కుటుంబాల్లో పుట్టి, చదువు లేక, ఊళ్లో పని దొరక్క, చేసిన వ్యవసాయం కలిసిరాక బతుకు బండి ఈడ్చేందుకు ఎడారి దేశాలు పట్టిపోయిన అభాగ్యులు ఎందరో. గల్ఫ్‌దేశాల్లోని మొత్తం భారతీయుల సంఖ్య సుమారు 90 లక్షలు కాగా, వారిలో 15 లక్షలమంది తెలంగాణ వారే ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. విదేశాల్లోని మన కార్మికుల ద్వారా భారత ప్రభుత్వం ఆర్జించే విదేశీ మారక ద్రవ్యం సుమారు రూ. 100 బిలియన్ డాలర్లు కాగా అందులో 60 శాతం గల్ఫ్ నుంచే వస్తోంది. వీరిలో మెజారిటీ వాటా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్,కరీంనగర్, పాలమూరు జిల్లాల వారిదే. ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి గల్ఫ్‌కు వెళ్తున్న వారిలో 18 నుంచి 30 ఏండ్లలోపు వారే ఎక్కువ.
వీరిలో 80 శాతం మంది నిరుపేద కూలీలే. వీరిలో సగం మందికి గుంట భూమి లేదు. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి ఇప్పటికే లక్షల్లో గల్ఫ్‌బాట పట్టగా నేటికీ నెలకు సగటున 1200 మంది కొత్తవారు గల్ఫ్ వెళ్తున్నారు. అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులుండే గల్ఫ్ దేశాల్లో, అయిన వాళ్లకు దూరంగా ఉంటూ, తమ నెత్తురును చెమటగా మార్చి తనవాళ్లైనా బాగా బతుకుతారనే ఆశలో బతికే ఆ బడుగుజీవుల వెతలను గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ వచ్చాయి.
ఇలా బతకటానికి గల్ఫ్ వెళ్తున్న తెలంగాణ కార్మికుల్లో చాలామంది అక్కడి చట్టాల మీద అవగాహన లేక, చిన్నాచితకా తప్పులకే జైలుపాలవుతున్నారు. వీరిలో 90 శాతం మంది వీసా గడువు తీరినా అక్కడే ఉండిపోవటం, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన, రంజాన్ నెలలో బహిరంగంగా తినటం, మంచినీరు తాగటం వంటి కారణాలతో వీరు జైలు పాలవుతున్నారు. ఇక, వీరి వద్ద బిర్యానీలో వాడే గసగసాలు, ఒళ్లు నొప్పుల టాబ్లెట్లు పట్టుబడినా 20 ఏళ్లకు పైబడి శిక్షలకు గురవుతున్నారు. గల్ఫ్ చట్టాల మీద అవగాహన లేక.. వీరు చేసిన చిన్నా చితకా తప్పులనే నేరాలుగా చూపుతూ వీరిని జైళ్లలో పెడుతున్నా, భారత రాయబార కార్యాలయాలు ఎలాంటి న్యాయసహాయం అందించటానికి ముందుకు రాకపోవటంతో వీరు ఏళ్ల తరబడి జైలు పక్షులుగా మిగిలిపోతున్నారు. ఖతార్‌లో అరెస్టయిన మన గూఢచారిని విడిపించేందుకు శతవిధాలా పనిచేసిన భారత ప్రభుత్వం, బడుగు గల్ఫ్ కార్మికుల చిన్నచిన్న తప్పులకు పడుతున్న శిక్షల విషయంలో మాత్రం పట్టింపులేనట్లుగా వ్యవహరిస్తోంది.
గల్ఫ్ వెళ్లే వలస దారులు నకిలీ ఏజెంట్ల బారిన పడి, వారిచ్చిన విజిట్ వీసాలతో ఆయా దేశాల్లో ప్రవేశించి అరెస్టై జైలు పాలవుతున్న ఘటనలూ తక్కువేమీ కాదు. అప్పు చేసి లక్షల రూపాయలు ఏజెంట్ల చేతిలో పోసి, ఆనక ఆ దేశంలో దొంగచాటుగా బతుకుతూ, ఏ పనీలేక, తిరిగి రాలేక, తెచ్చిన అప్పులు పెరిగిపోవటంతో ఆందోళనకు గురై అక్కడే చనిపోయిన వారూ వందల్లో ఉన్నారు. నకిలీ వీసాల బెడద వదిలించేందుకు, విదేశాంగ శాఖ తరపున ఒక హెల్ప్ డెస్క్, ఎన్నారై సెల్ ఏర్పాటు చేయాలని ప్రవాసీ సంక్షేమ మంత్రిత్వశాఖకు ఎన్నో వినతులు వస్తున్నా ఆ దిశగా ఒక్క అడుగూ ముందుకు పడలేదు.
ఇక.. కానీ, అక్కడికి వెళ్లాక ప్రతికూల పరిస్థితుల కారణంగా అనేక మంది చనిపోతున్నారు. 2022 నుంచి సుమారు 200 మందికి పైగా తెలంగాణ వాసులు గల్ఫ్‌లో కన్నుమూశారు. అక్కడ చనిపోయిన వారి మృతదేహాలను ఇక్కడికి తీసుకురావటానికి విదేశాంగ శాఖ ఎలాంటి చొరవ చూపటం లేదు. ఒక మృతదేహం ఇక్కడికి చేరాలంటే సుమారు రూ.3 లక్షల ఖర్చు అవుతోంది. దీంతో అక్కడి సహోద్యోగులు తలాకాస్త చందాలు వేసుకోవాల్సిన దుస్థితి ఉంది. ఇదీ సాధ్యంకాని సందర్భాల్లో మృతుల కుటుంబీకులు ఎమ్మెల్యేలు, ఎంపీలను ప్రాధేయపడాల్సిన దుస్థితి. వారి ప్రయత్నం కూడా సాధ్యం కాని కేసుల్లో, అక్కడే అంత్యక్రియలు జరిపి, ఆ కార్యక్రమాన్ని వీడియో కాల్‌లో చూసుకోవాల్సిన దీనస్థితి ఉంది.
గల్ఫ్‌లోని తెలంగాణ కార్మికులు అనారోగ్యంతో చనిపోయినా, హత్యకు గురైనా, ఆత్మహత్య చేసుకున్నా ఏ పరిహారం అందటం లేదు. యాక్సిడెంట్‌లో చనిపోయిన కేసుల్లోనూ మృతుల వీసా, పాస్‌పోర్టు సరిగ్గా ఉంటేనే సాయం అందుతుంది. ఫ్యాక్టరీల్లో పనిచేసే కార్మికులు చనిపోతే, అక్కడి యాజమాన్యాలు ఆదుకోవటానికి సిద్ధపడటం లేదు. కేంద్రం రూ.10 లక్షల బీమా పథకాన్ని అమలు చేస్తున్నా అవగాహన లేక, చాలామంది అందులో నమోదు చేసుకోవటం లేదు. ఒకవేళ చేసుకున్నా దాని కాలపరిమితి రెండేళ్లు మాత్రమే. ఆ తర్వాత దాని నుంచి ఏ రక్షణా అందదు. బీఆర్ఎస్ పార్టీ గతంలో కేరళ తరహా విధానాన్ని అమలు చేసి, తెలంగాణ ప్రవాస కార్మికులను ఆదుకుంటానని హామీ ఇచ్చిన అది నెరవేరలేదు.
కేరళ ప్రభుత్వంలో ప్రవాసుల మంచీచెడూ చూసేందుకు ఒక మంత్రిత్వ శాఖ ఉంది. ఆ రాష్ట్ర గల్ఫ్ పాలసీలో నోర్క్ రూల్స్ పేరిట ఒక అధికారుల బృందం 1996 నుంచి కేరళ వలస కార్మికుల కోసం పనిచేస్తోంది. 2008 ఆగస్టు నుంచి తమ రాష్ట్రానికి చెంది, విదేశాల్లో పనిచేస్తున్నవారికి గుర్తింపు కార్డులతో బాటు ‘స్వాంతన’ పేరుతో రూ.50 వేల ఉచిత వైద్య చికత్స పొందే పథకాన్ని అమలు చేస్తోంది. ఒకవేళ వలస కార్మికుడు ఏ దేశంలో మరణించినా, ప్రభుత్వమే ఆ ఖర్చు భరించి, మృతదేహాన్ని స్వగ్రామానికి చేరుస్తుంది. ఇక.. విదేశాల్లో పనిచేయాలనుకునే వారికి ముందుగా ప్రభుత్వం స్వంత ఖర్చుతో శిక్షణను ఇప్పించి, వారికి చట్టాల మీద అవగాహన కల్పిస్తోంది.
‘బొగ్గుబావి, బొంబాయి, దుబాయ్’ అని మాట్లాడిన కేసీఆర్, తెలంగాణ రాగానే గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల సాయం అందిస్తామని, రూ. 500 కోట్లతో తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని ఆర్భాటంగా ప్రకటించినా.. తన పదేళ్ల పాలనలో అవేమీ కార్యరూపం దాల్చలేదు. విదేశీ పెట్టుబడుల కోసం విదేశీ కంపెనీలకు సబ్సిడీలు, ప్రోత్సహకాలు ఇస్తున్న మన కేంద్ర ప్రభుత్వం గరిష్టంగా విదేశీ మారక ద్రవ్యాన్ని అందించే గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి చెప్పుకోదగ్గ నిర్ణయాలేమీ తీసుకున్న పాపాన పోలేదు. మన పొరుగుదేశమైన బంగ్లాదేశ్, బయటి దేశాల్లో పనిచేసే తన జాతీయుల సంక్షేమానికి 2.5 శాతం నిధులను వెచ్చిస్తోండగా, మన దగ్గర మాత్రం అలాంటి చొరవే లేదు. అయితే, రానున్న లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో అన్ని పార్టీలూ తమ తమ ఎన్నారై విభాగాల సాయంతో ఇక్కడున్న వారి ఓట్లను కైవసం చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ‘గల్ఫ్ మైగ్రేషన్ కారిడార్’గా పేరున్న నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ లోక్‌సభ స్థానాల పరిధిలో ఈ పార్టీలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తు్న్నాయి.
ఇక, తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా గల్ఫ్ బాధితుల గోస వినాలని పలు గల్ఫ్ సంఘాలు కోరుతున్నాయి. ఇప్పటికే గల్ఫ్ దేశాల్లో మరణించిన కుటుంబాల వారికి రూ.5 లక్షల సాయం అందించాలని కోరుతూ సీఎం రేవంత్ రెడ్డికి టీపీసీసీ ఎన్నారై విభాగం ప్రతినిధి బృందం ఒక వినతి పత్రాన్ని అందించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక ప్రత్యేక అధికారిని నియమించటం, ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయటం, బీమా పథకాన్ని అమలు చేయటం వంటివి అమలు చేయగలిగితే కనీసం కొత్త ప్రభుత్వంలోనైనా తమకు కాస్త ఊరట లభిస్తుందని గల్ఫ్‌లోని తెలంగాణ సంక్షేమ సంఘాలు కోరుతున్నాయి.