ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు గెలుపోటములు సహజం. ఎన్నికల వేళ.. జనం మద్దతు పొందిన వారు ప్రభుత్వాన్ని ఏర్పరచి సమాజపు అవసరాల మేరకు ఆయా ప్రాధాన్యతలను ఎంచుకొని పలు కార్యక్రమాలు, పథకాల ద్వారా ప్రజా సంక్షేమానికి కృషిచేస్తారు. మెజారిటీ దక్కని వారు విపక్షంలో కూర్చొని నిర్మాణాత్మకమైన విమర్శ, సలహాలతో ప్రభుత్వాన్ని జాగరూకపరుస్తూ వస్తారు. అయితే.. ఈ సోయి లేకనే.. బీఆర్ఎస్ పార్టీ అధికార పక్షం నుంచి విపక్షంలోకి వచ్చింది. అయితే.. ఇక్కడ దురదృష్టం ఏమిటంటే.. నేటికీ ఆ పార్టీ నేతల తీరులో అడుగడుగునా అహంకార ధోరణి కనిపించటం.
ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ ఎన్నికలు ఎక్కడ జరిగినా.. ఓడిన పార్టీ అధినేత తమ ఓటమిని అంగీకరిస్తూ ఒక మీడియా ప్రకటన చేయటంతో బాటు.. కొత్త పాలకులకు అభినందనలు తెలియజేయటం శతాబ్దాలుగా ఉన్న రాజకీయ సంప్రదాయం. ప్రజల తీర్పును గౌరవించే ఏ నేత అయినా.. దేశ చరిత్రలో ఇదే చేశారు. కానీ.. మన బీఆర్ఎస్ అధినేత మాత్రం తనను ఓడించిన ప్రజల మీద అసహనంతో, మీడియాకు కూడా ముఖం చూపించకుండా ఒంటరిగా తన ఫామ్ హౌస్‌కి వెళ్లిపోయారు. పదేళ్ల పాటు గొప్పగొప్ప ఆదర్శాలను, విలువలను, సంప్రదాయాలను వల్లెవేసిన ఈ పెద్ద మనిషి.. భారతదేశ చరిత్రలో నేటి వరకు ఏ పార్టీ అధినేత వ్యవహరించని రీతిలో వ్యవహరించి.. తన స్థాయి ఏ పాటితో రుజువు చేసుకున్నాడు.
అంతటితో ఆగితే ఫర్వాలేదు.. రెండు నెలలు తిరగక ముందే కాంగ్రెస్ సర్కారు పథకాల గురించి వెకిలిగా మాట్లాడటం మొదలు పెట్టారు. 2014లో తాను గద్దెనెక్కిన మూడేళ్ల వరకు ఎవరు ఏ ఎన్నికల హామీ గురించి గుర్తుచేసినా.. ‘కొత్తగా వచ్చిన రాష్ట్రంలో కాలూ చేయి సర్దుకోవటానికి సమయం పట్టదా’ అంటూ బుకాయించిందీ ఈయనే. మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన తెలంగాణను రూ. 7 లక్షల కోట్ల అప్పులో ముంచి, పథకాల అమలు గురించి పదేపదే తొందరపెడుతున్న ఈ నేత మాటలు వింటే.. ఆయన గతాన్ని మరిచిపోయాడనిపిస్తోంది.
ఇక.. ‘కార్యనిర్వాహక’ పాత్ర పోషించిన మరో తాజా ముఖ్యమైన తాజా మంత్రిగారు పదేళ్లుగా తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన అందరినీ నానామాటలూ మాట్లాడి.. ‘మాకు సంస్కారం ఉంది గనుక ఇవేమీ అనటం లేదు’ అని ప్రపంచంలో తెలివి అంతా తనకే ఉన్నట్లు ఫోజులు కొట్టారు. కాంగ్రెస్ హామీలను 420గా పోల్చటం, కేసీఆర్ ఓడిపోయామని ప్రజలు దిగులుపడుతున్నారని ప్రచారం చేసుకుంటున్నాడు. గత రెండు పర్యాయాలు తడబడని ఓటర్లు.. ఈసారి ఎందుకో బాగా మాయలో పడిపోయారనేది ఈయన ఫిలాసఫీ.
తెలంగాణ రాగానే ఈ ఉద్యమ పార్టీ.. ఇక పక్కా రాజకీయ పార్టీ అంటూ జనాన్ని మోసపుచ్చి.. వనరులను కుటుంబానికి, బంధువర్గానికి దోచిపెట్టి విధ్వంస పాలన చేసి తెలంగాణ పాలిటి మరణశాసనం రాసిన ఈ ఘనులు.. లక్షల కోట్ల ప్రజాధనాన్ని కాళేశ్వరం వంటి గుదిబండల మీద ఖర్చుపెట్టి.. తెలంగాణ ప్రజానీకం మీద మోయలేని ఆర్థిక భారాన్ని మోపారు. ‘అంతా మా ఇష్టం’ అంటూ అన్ని వ్యవస్థలనూ నిర్వీర్యం చేసి, ఫక్తు కుటుంబ పాలన చేశారు. సంక్షేమం, అభివృద్ధి అని పదేపదే వారు చెప్పిన మాటలు విన్న జనం.. అదంతా తమగురించే అనుకున్నారు. కానీ.. అదంతా దొర కుటుంబ సంక్షేమం, అభివృద్ధి అని అంచనా వేయలేకపోయారు. సంక్షేమం పేరుతో ఈ చేతితో ఇచ్చి, ఆ చేతితో దండుకున్నారు. బడుగుల జీవితాల్లో వెలుగులు నింపిన పేద పిల్లల రీయింబర్స్‌మెంట్, ఇందిరమ్మ ఇళ్లు, ఆరోగ్య శ్రీ వంటి విజయవంతమైన పథకాలను రద్దుచేసి.. డబ్బులు కాజేసే పథకాలు తెచ్చారు. తెలంగాణలో మద్యం, ఇసుక వ్యాపారాన్ని గుప్పిట పట్టి వేలకోట్లు దండుకున్నారు.
తెలంగాణకు వచ్చిన దేశ ప్రధానికి స్వాగతం చెప్పని ఏకైక సీఎంగా నిలిచి.. మన తెలంగాణ పేరును దేశస్థాయిలో చర్చకు పెట్టారు. కేంద్రంతో సఖ్యతను మరచి, అహంకారంతో అనేక కేంద్ర పథకాలను ఎద్దేవా చేసి, తెలంగాణ వాటాను వదలుకుని తీరనంత నష్టం చేశారు. సంపన్న రాష్ట్రమంటూ గొప్పలు పోయి, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలను ఎగతాళి చేసిన ప్రభుత్వ పెద్దలు.. ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించటానికి మాత్రం దిక్కులు చూశారు. అద్భుతమైన మానవాభివృద్ధి అంటూ ఊదరగొట్టిన నాటి సర్కారు పాలనలో బడుగుల పిల్లల హాస్టళ్లు పాడుపడి పోయాయి. చలికి కప్పుకునేందుకు దుప్పట్లూ ఇవ్వలేకపోయారు. రైతులు, కార్మికులు, రైతు కూలీలు, చేతి వృత్తుల వారు, దళితులు, బహుజనులు.. ఇలా అందరూ దగా పడ్డారు. ఉద్యోగులకు ఒకటో తారీకు జీతం ఇవ్వలేని పాలకులు.. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్లాంట్ల మొదలు.. కాళేశ్వరం వరకు ఎన్నో నిరర్ధక ఆస్తులను పెంచి.. జనం నడ్డి విరిచారు.
ఓటమి పాలై మూడు నెలలవుతున్నా.. ఇంత వరకు నిజాయితీగా ఓటమి మీద సమీక్ష చేసుకోకపోగా.. ‘మమ్మల్ని ఓడించి మీరు తప్పు చేశారు’ అని ప్రజల మీద అసహనం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇదంతా సోషల్ మీడియా మాయ అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కానీ.. నిన్నటి దాకా ఈ సోషల్ మీడియాను కనుసైగతో శాసించి, భిన్న స్వరాన్ని వినిపించిన వారిని వేధించిన సంగతి వీరు మరచినా.. జనం ఇంకా మరవలేదు. ఓటమి తర్వాత కాంగ్రెస్‌ను శత్రువుగా చూపుతూ కేంద్రంలోని బీజేపీ ప్రాపు పొందాలనే వికృత క్రీడకు సిద్ధమవుతున్న ఈ పాలకుల నైజాన్ని అటు ప్రజలు.. ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలి. పదేళ్లపాటు ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా లూటీ చేసి ఆర్థికంగా బలపడిన వీరి ఆర్థిక మూలాలను నాశనం చేసి.. వీరు అహంకారం వీడి వాస్తవంలోకి వచ్చేలా చేయాలనేదే నేడు ప్రజలు కోరుతున్నారు. లేకుంటే ఇన్నాళ్లుగా కాంగ్రెస్, బీజేపీలు చేసిన ప్రచారం అంతా బూటకమేనని ప్రజలు భావించే ప్రమాదమూ ఉంది.
తనను ఓడించిన ప్రజలను నిందిస్తున్న ఇలాంటి పాలకులతో తెలంగాణకు ఎప్పుడైనా ముప్పే. కనుక.. వీరిపై ప్రజలు చేయాల్సిన యుద్ధం ఇంకా మిగిలే ఉంది. అటు ప్రభుత్వం వీరి అవినీతిని తవ్వితీసి.. దిగమింగిన ప్రజాధనాన్ని కక్కించి, ఖజానాకు జమ కట్టించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
పడమటింటి రవి కుమార్
సీనియర్ జర్నలిస్ట్